కొత్త ఫింఛన్ విధానం నవంబర్ 1 నుంచి అమలు

0
Advertisement

KTR

Advertisement

హైదరాబాద్, సెప్టెంబర్ 13 ((టెలిమీడియా) : రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1వ తేదీ నుంచి కొత్త పింఛన్ల విధానాన్ని అమలుచేయనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పెంచిన పింఛన్లను నవంబర్ 1వ తేదీనుంచి డీఆర్‌డీఏ ద్వారా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. పింఛన్ల పంపిణీకి బయోమెట్రిక్ పద్ధతి అమలు చేస్తామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ 100రోజుల ప్రగతి నివేదిక, భవిష్యత్ కార్యాచరణపై బ్రోచర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధిలో పారదర్శక పాలనకు కాల్ సెంటర్ స్టిక్కర్‌ను, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లోగోను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పారదర్శక, అవినీతి రహిత ప్రజాసంక్షేమ పథకాలు రూపొందిస్తున్నదని చెప్పారు.

క్త్త్త్ర్క్షేత్రస్థాయి నుంచి ప్రజల అవసరాలను గుర్తించి, వాటిని పరిష్కరించడానికి కసరత్తులు చేస్తున్నదన్నారు. అందులో భాగంగానే గ్రామస్థాయి అవసరాలను తీర్చేలా మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టే గ్రామీణ రహదారుల నిర్మాణాల్లో ఐఆర్‌సీ నిబంధనలను అమలు చేస్తూ, నాణ్యతకు పెద్ద పీట వేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాబోయే నాలుగేండ్లలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని చెప్పారు. సుమారు రూ.20వేల కోట్లతో ప్రతి పట్టణం, గ్రామాలు, ఇంటిని అనుసంధానం చేస్తూ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ చేపట్టే ఈ గ్రిడ్ సర్వే పనులు 15 రోజుల్లో పూర్తి చేసి బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నట్లు తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటున్న నల్లగొండ జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఈ పనులను నల్లగొండలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటు, నిర్వహణ తీరుపై ఇప్పటికే గుజరాత్ మోడల్‌ను పరిశీలించినట్లు మంత్రి వెల్లడించారు. గ్రిడ్ నిర్వహణకు ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జే రేమండ్ పీటర్, పంచాయతీరాజ్ కమిషనర్ వెంకటేశ్వర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ చోలేటి ప్రభాకర్, పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సీఈవో ఏ మురళి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ఇంజినీర్ -ఇన్-చీఫ్ సురేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ సుబ్రహ్మణ్యశాస్త్రి, విద్యాసాగర్‌రెడ్డి, వివిధ జిల్లాల సెర్ప్ పీడీలు, డైరెక్టర్లు, ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌ల ప్రతినిధులు హజరయ్యారు.

Advertisement