మహరాష్ట్ర గవర్నర్ గా విధ్యాసాగర్ రావ్ నియామకం

0
Vidyasagar Rao
Advertisement

Vidyasagar Raoయూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు రాజీనామా చేస్తుండగా, మరోవైపు బీజేపీ సీనియర్ నేతలను మోడీ సర్కార్ రాజ్‌భవన్‌లకు పంపిస్తున్నది. ఈ మధ్యనే మిజోరం రాష్ర్టానికి బదిలీ చేయడంతో పదవికి రాజీనామాచేసిన కే శంకర్‌నారాయణన్ స్థానంలో తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మాజీ సహాయమంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావును మహారాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం నియమించింది. మార్గరెట్ అల్వా పదవీకాలం ముగియడంతో ఆమె స్థానంలో కల్యాణ్‌సింగ్‌ను రాజస్థాన్ గవర్నర్‌గా, హెచ్‌ఆర్ భరద్వాజ్ పదవీకాలం పూర్తవడంతో గుజరాత్ స్పీకర్ వాజుభయ్ వాలాను గవర్నర్‌గా ఎంపికచేశారు. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ మంగళవారం తెలిపింది. ఇక మిజోరం గవర్నర్ శంకర్‌నారాయణన్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త గవర్నర్‌ను నియమించేవరకు మణిపూర్ గవర్నర్ వీకే దుగ్గల్ మిజోరం అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. కేంద్రంలో మోడీ సర్కార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి షీలాదీక్షిత్‌తో కలిసి ఎనిమిదిమంది గవర్నర్లు వైదొలిగారు.

Advertisement

మిజోరం గవర్నర్ కమలా బేనీవాల్‌ను, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేసిన వీరేంద్ర కటారియాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలగించగా, కేంద్ర హోంశాఖ సూచనలతో ఎంకే నారాయణన్ (బెంగాల్), అశ్విని కుమార్ (నాగాలాండ్), బీఎల్ జోషీ (యూపీ), బీవీ వాంఛూ (గోవా), శేఖర్ దత్ (ఛత్తీస్‌గఢ్) గవర్నర్ పదవులకు రాజీనామా చేశారు. ఎన్డీయే ప్రభుత్వం తొలివిడుతగా రాంనాయక్ (ఉత్తర్‌ప్రదేశ్), కేసరినాథ్ త్రిపాఠి (బెంగాల్), ఓం ప్రకాశ్ కోహ్లీ (గుజరాత్), బల్‌రాంజీ దాస్ టండన్ (చత్తీస్‌గఢ్), పద్మనాభ బాలకృష్ణ ఆచార్య (నాగాలాండ్), సింగ్ సోలంకి (హర్యానా)లను గవర్నర్లుగా నియమించారు. ఇప్పుడు మరో నలుగురిని కొత్తగా రాజ్‌భవన్లకు పంపారు.

తెలంగాణకు గుర్తింపు తెస్తా-రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటా: విద్యాసాగర్‌రావు

మహారాష్ట్ర గవర్నర్‌గా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి పదవికి, తెలంగాణకు తగిన గుర్తింపు తీసుకొస్తానని సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. గవర్నర్‌గా నియామకం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పదవి ద్వారా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత తనపై పెరిగిందన్నారు. గవర్నర్‌గా నియమితుడైన విద్యాసాగర్‌రావును పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా బీజేపీలో చేరిన తనకు ఈ రోజు అరుదైన అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 1985 లో శాసనసభకు ఎన్నికైన సందర్భంలో నరేంద్ర, ఇంద్రసేనారెడ్డిలాంటి సీనియర్ నేతలున్నప్పటికీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించడం గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు. స్వయానా తన సోదరుడు రాజేశ్వర్‌రావు వామపక్షపార్టీ తరపున శాసనసభాపక్ష నాయకుడిగా ఉండేవారని, పార్టీలు వేరైనా ప్రజా సమస్యలపై కలిసి పోరాడేవారమని గుర్తుచేశారు.

అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాలను మహారాష్ట్ర గవర్నర్‌గా నిర్వహించే అవకాశం లభించడం సంతోషం కలిగిస్తుందన్నారు. విద్యాసాగర్‌రావు గవర్నర్‌గా నియమితుడవడంతో రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబురాలను జరుపుకున్నారు. సన్మాన కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, మాజీ గవర్నర్ వీ రామారావు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దన్‌నరెడ్డి, యెండెల లక్ష్మీనారాయణ, పార్టీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఎస్ మల్లారెడ్డి, చింతా సాంబమూర్తి, కాసం వెంకటేశ్వర్లు, శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసూన, ధర్మరావు, అరుణజ్యోతి పాల్గొన్నారు.

Advertisement